కొందరు సినిమా సెలబ్రెటీలు ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటారు. గుప్త దానాలు చేస్తారు. అయితే ఆ సాయం గురించి బయటకు వార్తలు కూడా రానివ్వరు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంత మందికి సాయం చేశారో చెప్పలేము. నిత్యం ఆయన నుంచి ఎంతో మంది సాయం పొందుతారు. ఎన్నో కుటుంబాలని ఆదుకున్నారు. ఎందరికో ఆపరేషన్లు చేయించారు. ఆర్దిక సమస్యలు తీర్చారు. అలాగే ఇండస్ట్రీలో అంత మంచి మనసున్న హీరో అల్లు అర్జున్ అనే చెప్పాలి. ఆయన కూడా తన అభిమానులకి అలాగే సాయం అని కోరిన వారికి వెంటనే సాయం చేస్తారు. తాజాగా అల్లు అర్జున్ చేసిన సాయం గురించి తెలిసి సినిమా అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా శభాష్ అంటున్నారు.

ఇటీవల ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా పేలుడు ఘటన జరిగింది. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో చాలా మంది కార్మికులు మరణించారు. అయితే ఈ ఘటనతో తండ్రిని కోల్పోయింది కడింపల్లి దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు. ఆమె గురించి అనేక మీడియాల్లో వార్తలు వచ్చాయి.ఆమె గురించి తెలుసుకుని చలించిపోయారు బన్నీ. వెంటనే ఆమెకి సాయం చేశారు. ఆమె పోషణ నిమిత్తం ప్రతీనెలా 7500 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని హామీ ఇచ్చారు.
జీవితాంతం ఈసాయం అందుతుందని తెలిపారు బన్నీ. విషాదం ఏమిటంటే ఈ ప్రమాదంలో ఆమె తండ్రి ధనరాజు మరణించారు. తల్లి కూడా కొంతకాలం క్రితం అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె పరిస్దితి చూసి తండ్రి చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అలాంటి తండ్రి లేకపోవడంతో ఆమె మరింత కుంగిపోయింది. ఆమెకి ఎవరూ దిక్కులేకుండా అయింది. ఆమెకి అన్నం పెట్టేవారు కూడా లేరు. దీంతో పక్కవారు అందరూ దుర్గకి సాయం చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ ఆమె వివరాలు తన టీమ్ ద్వారా తెలుసుకున్నారు. బన్నీ వాసుకి తెలియచేసి తన టీమ్ ని అక్కడకు పంపించి అసలు అక్కడ పరిస్దితి గురించి తెలుసుకుని ఆమెకి ఈసాయం ప్రకటించారు. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ తో పాటు స్ధానికులు కూడా బన్నీ మంచి మనసు గురించి ప్రశంసిస్తున్నారు.

