కొన్ని రాజకీయ పార్టీల ఏర్పాటు ఏ ముహూర్త బలంతో ఏర్పాటు చేస్తారో కాని, ప్రజల్లో ఓ శక్తిగా ముందుకు సాగుతాయి. నాడు తెలుగుదేశం అలాగే స్ధాపించారు ఇప్పటికీ ఓ చరిత్ర. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతటి ఛరిష్మాతో ముందుకు సాగుతోంది. వైసీపీ స్దాపించిన సమయంలో పార్టీలో జగన్ ఒక్కడే. ఇంతింతై వటుడింతై అన్నట్లు పార్టీ ఎంతో విస్తరించింది. 2014 లో ప్రతిపక్ష పాత్ర పోషించిన వైసీపీ 2019 లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. వైసీపీకి జగన్ సుప్రీం అనే విషయం తెలిసిందే. క్రమంగా వైసీపీ సైన్యం పెరిగారు. కోట్లాది మంది గుండెచప్పుడుగా వైసీపీ నిలిచింది. ఇప్పటికీ సౌత్ లో బలమైన కేడర్ సోషల్ మీడియా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ అనే చెబుతారు.
ఇక పార్టీ పుట్టుక ఓ విప్లవం అనే చెప్పాలి. నాటి రాజకీయ నాయకులు జగన్ ని చాలా తక్కువ అంచనా వేశారు. కానీ జగన్ ఇప్పుడు ఓ వృక్షంగా నిలిచారు. ఒక ప్రాంతీయ పార్టీని ఇంతలా కమిట్మెంట్ తో నడపడం చాలా పెద్ద విషయం. పైగా ఎవరితో పొత్తులు లేకుండా గెలుపైనా ఓటమైనా ఒంటరి ప్రయాణం చేస్తోంది వైసీపీ. 2011 మార్చి 12న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీని స్ధాపిస్తున్నానని జగన్ ప్రకటన చేశారు. రాజకీయంగా రాష్ట్రంలో ఓ కొత్త జోష్ వచ్చింది.
వైసీపీ స్దాపించిన వెంటనే కడప లోక్ సభ ఉప ఎన్నికలో 5 లక్షలకు పైగా ఓట్లతో చరిత్ర క్రియేట్ చేశారు. ఆ తర్వాత పులివెందుల ఎన్నిక ఎదుర్కొన్నారు. తన తల్లిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీ – పార్లమెంట్ లో అడుగుపెట్టింది వైసీపీ. తర్వాత ఏడాది ఎన్నికల జాతర అనే చెప్పాలి. ఏకంగా 18 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ కు ఎన్నిక జరిగింది. మొత్తం 18 సీట్లకు గాను 16 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇలా ఏడాదిలో 17 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలతో రాష్ట్రంలో జగన్ పిడుగులా మారారు. చంద్రబాబుకి కాంగ్రెస్ కి ఇది బిగ్ షాక్ తగిలింది.
ఇక 2014 ఎన్నికల్లో
జగన్ ఎన్నో ఆశలతో ముందుకు సాగారు. ఓ పక్క రాష్ట్ర విభజన చంద్రబాబు లాంటి సీనియర్ మరో హైటెక్ సిటీ నిర్మిస్తాడని గొప్ప రాజధాని సృష్టిస్తాడని భావించి జనం ఓట్లు వేశారు. ఇలాంటి పరిస్దితిలో కూడా దాదాపు 67 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది వైసీపీ, అంతేకాదు 8 మంది లోక్ సభకు వెళ్లారు. అంతేకాదు తెలంగాణలో కూడా మూడు ఎమ్మెల్యే స్ధానాలు గెలిచింది వైసీపీ. ఏపీలో కనివిని ఎరుగని రీతిలో 45 శాతం ఓట్ షేరింగ్ పొందింది. అధికార పార్టీకి ప్రతిపక్ష వైసీపీకి కేవలం 3 శాతం మాత్రమే ఓట్ షేర్ వ్యత్యాసం కనిపించింది. ఇక ఫిరాయింపులతో జగన్ ని ఎంత ఇరుకున పెట్టాలి అని చూసినా, జగన్ మాత్రం బెదరలేదు. పార్టీ నుంచి ఎవరైనా నాయకులు వెళితే కొత్త నాయకులు పుట్టుకువస్తారు అని ధీమాగానే ఉన్నారు.
ఇక 2019 ఎన్నికలు –
పాదయాత్ర ఓ రికార్డ్ గా నిలిచిపోయింది. ఆ నాడు రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు ఎంత స్పందన వచ్చిందో అలాగే జగన్ పాదయాత్రకు మరింత ఎక్కువ స్పందన వచ్చింది. 2019 ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండా 151 సీట్లు గెలుచుకుంది వైసీపీ. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేవలం పథకాల అమలుపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. కార్యకర్తలని నాయకులని విస్మరించారు. పూర్తిగా అధికారుల మాటలు గుడ్డిగా నమ్మారు, గ్రౌండ్ రియాలిటీ అంచనా వేయలేకపోయారు. నిరంతర సర్వేలతో ఆ రిపోర్టులతో పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. వైసీపీకి తర్వాత జరిగిన ఎన్నికలు ఓ పెద్ద షాక్ ఇచ్చాయి. కేవలం 11 స్ధానాలు మాత్రమే గెలుచుకుంది వైసీపీ. కూటమిగా జనసేన టీడీపీ బీజేపీ కలిసి వచ్చాయి. అయినా జగన్ ఒంటరి పోరాటం చేశారు. అయితే ఇక్కడ వైసీపీకి ఊరట కలిగించేది ఆయనకు 40శాతం ఓట్ షేర్ ఏపీలో నిలబడింది. అంటే ప్రజల్లో జగన్ కు ఎంత క్రేజ్ నమ్మకం ఉందో ఈ ఓట్ షేర్ తెలియచేస్తుంది.
2009 నుంచి ఇప్పటి వరకూ 16 సంవత్సరాలు గడిచింది. జగన్ జీవితంలో కేవలం వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మినహా మిగిలిన అన్ని సంవత్సరాలు ఆయన ఎన్నో బాధలు అనుభవించారు, జైలు జీవితం గడిపారు, రాజకీయ విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్నారు, నమ్మిన వారు జగన్ ని మోసం చేశారు, రాజకీయ ఉనికి కోసం జగన్ నుంచి దూరం అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కు బాగా ఇబ్బంది కలిగింది మనసుకి బాధ కలిగిన విషయం విజయసాయిరెడ్డి పార్టీ విడిచి వెళ్లడం. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న ఆయన రాజకీయంగా జగన్ కు దూరంగా సాగడం అందరినీ షాక్ కి గురిచేసింది.
ఇక వైసీపీలో పదవుల విషయంలో కూడా జగన్ డెసిషన్ ఫైనల్. ఆయనే సుప్రీం కాబట్టి ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే నిర్ణయాధికారం ఆయనదే. ఇది కూడా వైసీపీకి కాస్త కలిసి వచ్చింది 2019 ఎన్నికల్లో.
ఇక 2024 ఎన్నికల్లో రిపోర్టులతో సీట్లు టికెట్లు ఇవ్వడం జగన్ కు అతి పెద్ద మైనస్ అయింది. 40 ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు, టీడీపీ సంస్ధాగతంలో ఎంతో బలమైన పార్టీ. చంద్రబాబు ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డితో ఫైట్ చేశారు, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ తో ఫైట్ చేస్తున్నారు. 40 ఏళ్లుగా టీడీపీ బలంగా ఉంది. సంస్ధాగతంగా టీడీపీని ఎదుర్కోవడం అంటే కష్టం అనే చెప్పాలి. ఇక జగన్ వ్యూహాలు ఎవరికి అర్దం కావు ఇదే ఆయనకు ప్లస్.
ఇక పవన్ కల్యాణ్ ని పెద్ద రాజకీయ పోటీదారుడిగా జగన్ ఎన్నడూ చూడరు. అయితే కూటమిగా వచ్చారు కాబట్టి విజయం వచ్చింది. అదే ఒక్కొక్కరుగా వచ్చి ఉంటే ఫలితం వేరేగా ఉండేది అనేది వైసీపీ కేడర్ ఇప్పటికీ ప్రశ్నిస్తారు. మరో 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుంది అని చెబుతున్నారు. సో జగన్ వచ్చే ఎన్నికల్లో కూటమితో పోరాటానికి సిద్దంగానే ఉన్నారు. మరో ప్రజా సంకల్పయాత్ర కూడా త్వరలో చేయనున్నారు.

