ఏపీ రాజ్యసభ రేసులో తెరపైకి అన్నామలై పేరు
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అన్నామలై పేరు పెద్దగా వినిపించడం లేదు. ఎందుకంటే ఆయన ఈ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో పోటికి దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే అలాగే బీజేపీ పక్షాలు ఇక్కడ పోటీ చేస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల బరిలో తాను ఉండను అని ప్రకటించడం ఆయన వర్గం కూడా షాక్ అయింది. తాజాగా బీజేపీ నాయకుల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తే, ఆయనకు త్వరలో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
ఏపీలో త్వరలో జరగబోయే రాజ్యసభ పదవుల్లో ఒకటి అన్నామలైకి దక్కే అవకాశం ఉంది అంటున్నారు. ఈ జూన్ నెలలో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనున్నాయి. ఇక టీడీపీకి రెండు బీజేపీకి ఒకటి జనసేనకి ఒక సీటు రానుంది. ఇందులో బీజేపీ తరపున తమిళనాడు నుంచి అన్నామలైని పంపే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో , బీజేపీ అన్నామలై పేరు సిఫార్సు చేస్తుంది అని భావించారు, కానీ పాక వెంకట సత్యనారాయణకు అవకాశం ఇచ్చింది.
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈసారి అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో ఏకంగా పోటీ నుంచి తప్పుకున్నారు అన్నామలై. ఇక ఈసారి జనసేన నుంచి తొలిసారి రాజ్యసభకు ఒకరు వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ కు అత్యంత ఆప్తుడైన లింగమనేని రమేష్ పేరు తెరపైకి వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా లిస్ట్ మాత్రం పెద్దదే ఉంది.
ఈసారి రేసులో సానా సతీష్ పేరు వినిపిస్తోంది, ఇప్పటికే ఆయనకు ఛాన్స్ ఇచ్చారు, మరోసారి ఆయన పేరు సిఫార్స్ చేయనున్నారట. ఒకవేళ ఆయనకు ఈ పదవి ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ
ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ఆయనని డిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా పంపుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సతీష్ కు కాకుంటే కిలారు రాజేష్ పేరు వినిపిస్తుంది. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు సో ఆయనకు కూడా అవకాశం ఉంది.
ఇక ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేరు వినిపిస్తోంది. అలాగే యనమల రామకృష్ణుడు పేరు తెరపైకి వచ్చింది. కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమా, ఇక సీనియర్ నేత వర్ల రామయ్య పేరు వినిపిస్తోంది. ఇంకా 2 నెలల సమయం ఉంది మరి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.
మొత్తం మీద అన్నామలై పేరు తెరపైకి రావడంతో ఏపీ రాజ్యసభ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. కూటమిలోని పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

