Homeజాతీయప‌శ్చిమ బెంగాల్ సీఎం - సువేందు అధికారి రియ‌ల్ స్టోరీ

ప‌శ్చిమ బెంగాల్ సీఎం – సువేందు అధికారి రియ‌ల్ స్టోరీ

ప‌శ్చిమ బెంగాల్ సీఎం
సువేందు అధికారి రియ‌ల్ స్టోరీ

50 ఏళ్ల రాజకీయంలో బీజేపీ వెస్ట్ బెంగాల్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్, క‌మ్యూనిస్టులు, తృణ‌ముల్ మిన‌హా ఇక్క‌డ ఎవ‌రూ పాగా వేయ‌లేదు. కానీ ఇప్పుడు అక్క‌డ కాషాయం జెండా ఎగిరింది. ఏకంగా 207 అసెంబ్లీ సెగ్మెంట్ల‌ని బీజేపీ గెలుచుకుంది. శ‌నివారం కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత‌గా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. ఆయ‌నే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీలోనే ఉంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సువేందు, మ‌మ‌త మేన‌ల్లుడితో రాజ‌కీయంగా చాలా విష‌యాల్లో విభేదాలు వ‌చ్చాయి. ఇక ఆ పార్టీలో ఇమ‌డ‌లేక బీజేపీలోకి వ‌చ్చారు. అక్క‌డ నుంచి వెస్ట్ బెంగాల్ రాజ‌కీయాలు మారిపోయాయి. మ‌రి ప‌శ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి రియ‌ల్ స్టోరీ చూద్దాం ఈ క‌థ‌నంలో.

1970 డిసెంబరు 15వ తేదీన పశ్చిమ బెంగాల్ తూర్పు మేదినీపుర్‌ జిల్లాలోని కర్కులీలో పుట్టారు సువేందు అధికారి. ఆయ‌న తండ్రి కూడా ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు, తండ్రి శిశిర్ ఎమ్మెల్యేగా ఎంపీగా సేవ‌లు అందించారు. అంతేకాదు యూపీఏ హ‌యాంలో కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ స‌హాయ‌మంత్రిగా ఆయ‌న ప‌నిచేశారు. సువేందు ఎంఏ పూర్తి చేశారు.

1995లో తొలిసారి సువేందు అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఆ త‌ర్వాత 1998లో త‌న తండ్రితో క‌లిసి మ‌మ‌త పార్టీ తృణ‌ముల్ కాంగ్రెస్ లో చేరారు. 2006 నుంచి ఆయ‌న 2009 మ‌ధ్య రాష్ట్ర నాయ‌కుడిగా పేరు పొందారు. 2006లో తొలిసారి కొంటాయీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్క‌డ మున్సిప‌ల్ చైర్మ‌న్ గా కూడా ప‌నిచేశారు.

2007లో జరిగిన నందిగ్రామ్‌ ఉద్యమం సువేందు అధికారి జీవితాన్ని మార్చేసింది, నందిగ్రామ్ లో సుమారు 10 వేల ఎక‌రాల భూమి సేక‌రించి సెజ్ ఏర్పాటు చేయాలి అని అప్ప‌టి వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీనిని పెద్ద ఎత్తున టీఎంసీ వ్య‌తిరేకించింది. సువేందు అధికారి అక్క‌డ పెద్ద ఉద్య‌మం న‌డిపారు. ఈ ప్రాంతంలో ఆయ‌న‌కు తిరుగులేని నాయ‌కుడిగా పేరు వ‌చ్చింది.

జంగల్‌ మహల్‌, మేదినీపుర్, పురూలియా, బాంకురా జిల్లాల ప్రాంతానికి టీఎంసీ ఇంఛార్జ్‌గా మ‌మ‌త సువేందుని నియ‌మించారు. ఈ ప్రాంతాల్లో పార్టీని మ‌రింత బ‌లంగా మార్చారు ఆయ‌న‌. 2009లో తమ్లుక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఇక 2016లో మ‌మ‌త ఆయ‌న్ని నందిగ్రామ్ నుంచి పోటికి దించారు. క‌నివీని ఎరుగ‌ని మెజార్టీతో గెలిచారు. త‌ర్వాత మ‌మ‌త కేబినెట్ లో మంత్రి అయ్యారు సువేందు.

2017లో టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్‌ రాయ్‌ పార్టీని వీడిన తర్వాత పార్టీలో సీనియర్లు కొంద‌రు దూరం అయ్యారు. ముఖ్యంగా మ‌మ‌త తీసుకున్న నిర్ణ‌యాలు ఏక‌ప‌క్షంగా ఉండటంతో సీనియ‌ర్ల‌కు విలువ లేకుండా పోయింది. ఈ స‌మ‌యంలో మ‌మ‌త మేన‌ల్లుడు అభిషేక్‌ బెనర్జీ ప్రాధాన్యం పెరగడంతో, అన్నింటికి అత‌ని అనుమ‌తి తీసుకోవ‌ల‌సి వ‌చ్చేది . చివ‌ర‌కు సువేందు మ‌మ‌త మేన‌ల్లుడి మ‌ధ్య అనేక విభేదాలు వ‌చ్చాయి.
అలాగే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో 2020 చివర్లో టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు సువేందు.

గ‌త ఎన్నిక‌ల్లో 2021లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి మ‌మ‌త‌పై గెలిచారు ఆయ‌న‌.. 2021 లో అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌నిచేశారు. కానీ ఈ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసి మ‌మ‌త‌ను ఓడించారు. వ‌రుస‌గా 2021-2026 రెండు ఎన్నిక‌ల్లో సువేందు గెలిచారు.ఒకప్పుడు టీఎంసీలో దీదీ తర్వాత నెంబ‌ర్ 2గా పేరు పొందిన‌ సువేందు అధికారి.. ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు.

294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 207 సీట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో 2011 నుంచి బెంగాల్‌లో 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత పాలనకు తెరపడింది. ఇక సువేందు బ్ర‌హ్మచారిగానే ఉన్నారు వివాహం చేసుకోలేదు. తాను పెళ్లి చేసుకుంటే రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉప‌యోగించి నా కుటుంబం ప్ర‌యోజ‌నం పొందుతారు అనే ఆలోచ‌న‌తో, తాను వివాహానికి దూరంగా ఉన్నాను అని తెలిపారు సువేందు. పశ్చిమ బెంగాల్‌ను కొత్త దిశగా నడిపించే బాధ్యతను చేపట్టారు సీఎం. చూడాలి ఇక్క‌డ బీజేపీ తొలిసారి ఎలాంటి పాల‌న అందిస్తుందో.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments