ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ఓ పక్క పార్టీని నమ్ముకుని కొంత కాలంగా సర్వీస్ చేసిన నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఏపీలో తెలంగాణలో కూడా కొంత కాలంగా రాజకీయాల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం పెను చర్చకు కారణం అవుతోంది. కాంగ్రెస్ తరపున సీనియర్ లీడర్ గా ఉన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అయితే ఆయన మాట కాదని సంజయ్ ని తీసుకోవడం పట్ల కాస్త అసహనంగానే ఉన్నారు జీవన్ రెడ్డి.
ఇటీవల తనతో కలిసి పనిచేయాలంటూ సంజయ్ నాకు చెబుతున్నాడు, అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడు. ఓ పక్క బీఆర్ఎస్ లో ఉన్నాడు అని స్పీకర్ అంటున్నారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నన్ను కలిసి పనిచేయాలి అని కోరడం ఏమిటి అని చురకలు అంటించారు . తాను ఏమైనా పార్టీ మారతాను అని సంజయ్ కి ఏమైనా చెప్పానా, పార్టీ వీడాలి అని ఆలోచన రావడానికి కారణం కూడా సంజయ్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇక పార్టీలో ఇలాంటి పరిస్దితి రావడానికి కారణం సంజయ్ కుమార్ అని జీవన్ రెడ్డి విమర్శించారు.
అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అనేది ముందు నువ్వు చూసుకో అంటూ, నిన్న అసెంబ్లీ లాబీల్లో జీవన్ రెడ్డి మాట్లాడారు. అసలు నాకు చెప్పడానికి నువ్వు ఎవరు, పార్టీలో నాలుగు దశాబ్దాల అనుబంధం నాది, అలాంటి పార్టీని విడిచి వెళ్లాలంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా అంటూ మదనపడ్డారు జీవన్ రెడ్డి. నీ రాజకీయాలు నాకు తెలుసు బలహీన వర్గాల మహిళకు కేటాయించిన చైర్మన్ సీట్ నుంచి ఆడబిడ్డని దించేశావు. నువ్వు చదువుకున్న వాడివి చట్టం తెలుసు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు ఆయన.
రాజ్యాంగాన్ని పాటించని వ్యక్తి నాకు నీతులు చెబుతున్నాడు. ఇంట్లో ఉడుము వస్తే ఇంటిలో ఉండం కదా, బయటకు వెళతాం కాంగ్రెస్ లోకి వచ్చింది సంజయ్, ఇలా ఉడుములా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ప్రజలు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించాలి. కానీ నువ్వు అవేమీ చేయడం లేదు అని ఆయన విమర్శించారు. పార్టీలో ఉండాలని నాకూ ఉంది. కానీ ఉండలేని పరిస్దితులు క్రియేట్ అవుతున్నాయి అని మండిపడ్డారు.
నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒకవేళ పార్టీ వీడితే దానికి కారణం సంజయ్, అయితే సంజయ్ ని ఇంతలా ఎవరు ప్రొత్సహిస్తున్నారో తనకు తెలియదు అన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి కూడా బాధ్యత ఉంది. అలాగే ఆరు గ్యారంటీల అమల్లో జాప్యం ఉంది. ప్రజల్లో దీనిపై అసంతృప్తి ఉంది. నేను పార్టీ వీడితే ఇది ఆగుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలను దూరం పెట్టడం దీనికి పరిష్కారం, మరి కాంగ్రెస్ ఇది చేస్తుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మాటల బట్టి త్వరలో ఆయన పార్టీ వీడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

